Home > Featured > తెలంగాణలో మరీ అంత తక్కువా? కరోనా పరీక్షలపై కేంద్రం ఆగ్రహం

తెలంగాణలో మరీ అంత తక్కువా? కరోనా పరీక్షలపై కేంద్రం ఆగ్రహం

Centre hits out at Telangana for low test policy

తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21 వేల కరోనా టెస్టులు మాత్రమే జరిగాయని మండిపడింది. కరోనా మహమ్మారిపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి గురువారం లేఖ రాశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచనలు జారీచేసింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని స్పష్టంచేశారు. అలాగే ఐసీఎంఆర్ నిబంధల ప్రకారమే కరోనా పరీక్షలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 2.1 శాతం వుంది. దేశంలో 3.5 శాతం కరోనా మరణాల రేటు వుంది. వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’ అని మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు. కాగా, మిగతా చోట్లతో పోలిస్తే అతి తక్కువ పరీక్షలు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే.

Updated : 21 May 2020 8:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top