మన మొబైల్ ఫోన్ మనకీ తెలియకుండా ఎక్కడినుంచో వేరే వారు ఉపయోగిస్తున్న రోజులివి. టెక్నాలజీని ఉపయోగించుకొని కావాల్సిన సమాచారం లాగేస్తున్నారు కేటుగాళ్లు. వ్యక్తిగత జీవితానికి ఎంత భద్రత లేదో..దేశ రక్షణకు కూడా అంతే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇటీవల పెద్దఎత్తున గూఢచర్యం, డేటా చోరీ భారీగా జరుగుతోదంటూ ఆరోపణలు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్‌లలో ముందుగా ఇన్ స్టాల్ చేసిన యాప్‌ల ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని తెలుస్తోంది. ప్రధానంగా చైనా వంటి దేశాలు ఇలాంటి దురాక్రమణలకు ఎక్కువగా పాల్పడుతోందిని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇటవంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోంది.
భద్రతకు పెద్ద పీట వేస్తూ మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను తొలగించే అవకాశం ఉండేలా చర్యలు చేపడుతోంది. మొబైల్ తయారీ కంపెనీలకు ఈ ఆదేశాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను తప్పనిసరిగా పరీక్షించేందుకు అవకాశం ఉండేలా చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న నిబంధనల ప్రకారం ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశం ఉంది. అయితే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్ ఉండడంతో ఈ రూల్స్ పై వెనక్కు తగ్గడం లేదు.
షియోమి సంస్థ గెట్ యాప్స్, సామ్ సంగ్ సామ్ సంగ్ పే, ఐఫోన్లలో సఫారీ బ్రౌజర్ల వంటివి ముందే డిలీట్ చేయని విధంగా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లతో వస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారులు తమ కొత్త మోడళ్లలో అన్ ఇన్ స్టాల్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో చైనా వ్యాపారాలపై భారత్ సర్కార్ దృష్టాసారించింది. డ్రాగన్ దొంగ బుద్ధిని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తోంది .టిక్‌టాక్ సహా సుమారు 300 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది.ఒక్క భారతదేశమే కాకుండా మిగతా దేశాలు కూడా చైనా వ్యవహారంపై దృష్టి పెట్టాయి. ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీలు ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము గూఢచర్యానికి పాల్పడటం లేదని చైనా చెప్తోంది.