రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు, ప్రమాదానికి గురై బాధితులకు భరోసా అందించేందుకు కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైవేలపై తిరిగే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఆన్-ది-స్పాట్ ఇన్సూరెన్స్ కవర్ అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇన్సూరెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలలో థర్డ్ పార్టీకి పరిహారం అందించే వీలు లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడిన వాహనాలకు అక్కడికక్కడే, అప్పటికప్పుడే బీమా చేయించాలని కేంద్రం భావిస్తోంది. యజమాని ఫాస్టాగ్ అకౌంట్ నుంచి ప్రీమియం మినహాయించే యోచనలో ఉంది. రహదారిపై ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఇండియాలో ఉన్న వాహనాల్లో దాదాపు 40-50 శాతం వరకు ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నాయని అంచనా. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రమాద బాధితులకు చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది.
త్వరలోనే ఈ విధానంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి అభిప్రాయాలను కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆన్ ద స్పాట్ ఇన్సూరెన్స్’ అధికారాన్ని ట్రాఫిక్ పోలీసులకే ఇవ్వనున్నట్లు, ఇందుకోసం వారికి ప్రత్యేక పరికరాలను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వానికి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు కచ్చితంగా బీమా ఉండేలా చూడాలని కేంద్ర రవాణా శాఖకు కౌన్సిల్ సూచించింది. ఇలాంటి వాహనాలను గుర్తించేందుకు కొత్త రకం పరికరాన్ని ఉపయోగించాలని సిఫార్సు చేసింది.
ఈ విషయంపై జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC)లోని అధికారి ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్-ది-స్పాట్ పాలసీలకు ప్రీమియం చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా బ్యాంకులతో పాటు ఫాస్టాగ్ ప్లాట్‌ఫారం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రీమియంను ఫాస్టాగ్ బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. స్పాట్ ఇన్సూరెన్స్ గురించి కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చించారని, దాని అమలు కోసం సిఫార్సులు రూపొందిస్తున్నారని అన్నారు. ఫాస్ట్ ట్యాగ్ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించుకునేందుకు బీమా కంపెనీలకు అనుమతినివ్వాలని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కోరినట్లు.. ఈ సూచనలపై మార్చి 17న జరిగే సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.