తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు

August 30, 2019

కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు కంపా నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణకు మొదటిసారి మొదటి సారిగా 3 వేల 110 కోట్ల నిధులు ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెక్కు అందజేశారు. తెలంగాణ అటవీ అభివృద్ధికి రాష్ట్రం చేస్తున్న కృషిని అభినందించారు. అయితే ఈ నిధులను జీతాలు చెల్లించేందుకు, ఇతర ఖర్చులకు ఉపయోగించొద్దని చెప్పారు. 

కేవలం అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు వాడాలని చెప్పారు. తెలంగాణతో పాటు మిగితా రాష్ట్రాలకు 47 వేల 436 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రానికి 5933.98 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…’కేంద్ర ప్రభుత్వం కాంపా నిధుల్లో భాగంగా రాష్ట్రానికి 3 వేల 110కోట్లు ఇచ్చింది. ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి గతంలో ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగించడం వల్లే నిధులు ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. హరిత హారానికి మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాను’ అన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కోసం కేంద్రం రూ.1734 కోట్లను విడుదల చేసింది. ఈమేర కేంద్రమంత్రి ప్రకాష్ జేవదేకర్ ఏపీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ..’కేంద్రం ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుంకుంటాం. ఎర్ర చందనం అమ్మకానికి అనుమతి ఇవ్వాలని కోరం. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. అమ్మకాలకు అనుమతినిస్తే స్మగ్లింగ్‌ను నివారించవచ్చు’ అన్నారు.