Centre's step forward..extension of subsidy on cooking oils
mictv telugu

కేంద్రం ముందడుగు..వంట నూనెల రాయితీ పొడగింపు

September 2, 2022

కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సామాన్యులకు ఊరటనిచ్చే విషయాన్ని తెలియజేసింది. వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్‌ డ్యూటీని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ, శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటనలో..”దేశవ్యాప్తంగా వంట నూనెల రాయితీ కస్టమ్స్‌ సుంకం 2023 మార్చి 31 వరకు కొనసాగుతుంది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, వంట నూనెల ధరలు నియంత్రణలో ఉంటాయి” అని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముడి పామాయిల్, ఆర్‌బీడీ పామోలీన్, ఆర్‌బీడీ పామ్‌ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్‌ పొద్దుతిరుగుడు నూనెపై సుంకాలు కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. అంతేకాదు, ముడి పామాయిల్, సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై ప్రస్తుతం సుంకాల్లేవని, కాకపోతే 5 శాతం అగ్రిసెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్‌ కలుపుకుని 5.5 శాతం పడుతోందని అధికారులు పేర్కొన్నారు.

సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షర్స్‌ అసోసియేషన్‌ ఈడీ బీవీ మెహతా మాట్లాడుతూ..”రిఫైన్డ్‌ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్‌ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించింది” అని ఆమె అన్నారు.