రైతునై ఉంటే సచ్చిపొయ్యెటోణ్ని! - MicTv.in - Telugu News
mictv telugu

రైతునై ఉంటే సచ్చిపొయ్యెటోణ్ని!

September 2, 2017

ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కూడా దేశానికి అన్నం పెట్టే రైతు  తలరాత మాత్రం మారడంలేదు. రైతుల పరిస్థితి మనదేశంలో ఎంత అధ్వాన్నంగా ఉందో  మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు వివరించారు. ‘నేను రాజకీయ నాయకుడిగా కాకుండా రైతుగా ఉండుంటే ఇప్పటివరకు చాలా సార్లు ఆత్మహత్యలు చేసుకునే వాడిని.. ’ అని అన్నారు. ‘మన దేశంలో ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మగౌరవాన్ని మాత్రం విడిచిపెట్టరు.  పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ది జరగాలి. ఎన్నికల తరువాత రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్దికి కృషి చేయాలి.  దేశాభివృద్ధికి  పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.. వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి అనుసంధానం చేస్తే ఫలితాలుంటాయి’ అని ఆయన అన్నారు.

శనివారం ఆయన తన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంకి వెళ్లారు .గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా సొంతూరుకు వచ్చారు. గవర్నర్ పదవీకాలం పూర్తయ్యాక, స్వగ్రామం నాగారంలోనే స్థిరపడతానని విద్యాసాగర్ అన్నారు. నాగారంలో ఉన్న తన భూమి హైదరాబాద్‌లోని గుంట భూమితో సమానం కాకపోవచ్చు.. కానీ తన గుండె మాత్రం ఇక్కడే ఉందని ఉద్వేగానికి లోనయ్యారు. మూడు వందల ఏళ్ల క్రితమే మనది ధనిక దేశమని, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఇంకా అభివృద్ది జరగాల్సి ఉందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.