ఓ ఆటగాడు మద్యం మత్తులో నన్ను చంపాలని చూశాడు : చాహల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓ ఆటగాడు మద్యం మత్తులో నన్ను చంపాలని చూశాడు : చాహల్

April 8, 2022

 

nggnf

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తనపై 2013లో జరిగిన హత్యాయత్నాన్ని గురించి వెల్లడించాడు. తోటి స్పిన్నర్ అశ్విన్‌తో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించాడు. చాహల్ మాటల్లో.. ‘2013లో నేను ముంబై తరపున ఐపీఎల్ ఆడుతున్నా. ఆ రోజు బెంగళూరులో మ్యాచ్ గెలిచాక టీం సభ్యులకు చిన్న పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ఆటగాడు నన్ను తదేకంగా చూస్తున్న విషయం గమనించా. అతని పేరు చెప్పను కానీ, నన్ను పిలిచి బయటకి తీసుకెళ్లాడు. అనంతరం ఆ తాగుబోతు ప్లేయర్ 15వ అంతస్తు బాల్కనీ నుంచి నన్ను వేలాడదీశాడు. నా రెండు చేతులతో అతని మెడ గట్టిగా పట్టుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏ మాత్రం పట్టు తప్పినా నేను కిందపడి చనిపోవడం ఖాయం. ఇది చూసిన మిగతా ఆటగాళ్లు నన్ను అతడి నుంచి రక్షించారు. కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రాథమిక సపర్యలు చేసి నన్ను రూంకి తీసుకెళ్లారు. కొద్దిలో చావు నుంచి బయటపడ్డా. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం వలన మనసు తేలికవుతుందని చెప్తున్నా’నంటూ వివరించాడు. చాహల్ చెప్పిన ఉదంతంపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అలాగే, ముంబై ఇండియన్స్ టీం మేనేజ్‌మెంట్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, 2013లో చాహల్ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ ఆడారు. మరుసటి సంవత్సరం బెంగళూరు టీంకి మారాడు. ఇప్పటివరకు అదే టీంకు ఆడి, ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు.