మంచి మాటలతో పోలీసులను బోల్తా కొట్టించాడు ఓదొంగ. సినీ ఫక్కీలో ప్లాన్ వేసి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. అతడి కోసం పోలీసులు కాళ్లు అరిగిపోయేలా వెతికినా ఫలితం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లాలో ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే..నెల్లూరు గ్రామీణ మండలంలో ఒంటరి మహిళలను టార్గెట్‌గా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా వీరిని రాత్రి ఏఎస్ పేటకు తీసుకెళ్లారు. వారిలో ఎ.గిరితో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. అయితే వారిలో గిరి పోలీసుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలను కున్నాడు. ఇందుకోసం ఓ ప్లాన్ వేసి పక్కాగా అమలు చేశాడు.
తమతో కలసి నేరాలకు పాల్పడే మరో వ్యక్తి, సంగంలోని కొండ ప్రాంతంలో ఉంటాడని పోలీసులను నమ్మించాడు. అక్కడికి వెళ్తే అతడిని పట్టుకోవచ్చంటూ చెప్పాడు. అతడిపై నమ్మకంతో గిరితో పాటు మరో నిందితుడిని జీపులో ఎక్కించుకుని పోలీసులు అటు వైపు వెళ్లారు.అతడు ప్లాన్‌లో భాగంగా పోలీసులను మాటల్లోకి దించాడు. ఈ క్రమంలోనే ఆత్మకూరు వైపు వెళ్తుండగా తోటి నిందితుడితో కలిసి వేసిన సంకెళ్లను తొలగించుకొని ఒక్కసారిగా వాహనంలోంచి కిందికి దూకేశాడు. పోలీసులు జీపు ఆపి పట్టుకునేలోపు బీరాపేరు వాగులోకి పారిపోయాడు. పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చుట్కపక్కల వెతికినా జాడ దొరక్కపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.
అయితే దొంగ వాగులో గల్లంతయ్యాడా..? తప్పించుకుని పారిపోయాడా అనేది క్లారిటీ రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.