హైదరాబాద్ ప్రాంతంలో ఉండే ప్రజలకు ముఖ్య హెచ్చరిక. నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెడలో తలతల మెరిసే బంగారం కనబడితే బైక్ వచ్చి క్షణాల్లో లాగేసి పరార్ అవుతున్నారు. శనివారం ఉదయం గంటల వ్యవధిలోనే ఆరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉ. 6:20 గంటలకు ఉప్పల్, 6:40 గంటలకు కళ్యాణ్పురి, 7:10 గంటలకు నాగేంద్ర నగర్,7:40 గంటలకు రవీందర్ నగర్,. 8:00 గంటలకు చిలకలగూడ పీఎస్ రామాలయం గుండు, 8:10 గంటలకు రాంగోపాల్‌పేట్ పీఎష్ రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. వరుస స్నాచింగ్‌ల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. బాధితుల సమాచారం మేరకు స్నాచర్లను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
వీళ్లంతా ఒకటే ముఠా అని గుర్తించి.. 12 బృందాల గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం విస్తృత తనిఖీలు జరగుతున్నాయి. చోరీ చేసిన వాహనాలతోనే స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై దృష్టి సారించారు. సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌ని సైతం పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇటీవల జంటనగరాల్లో తగ్గుముఖం పట్టిన చైన్ స్నాచింగ్ కేసులు..మళ్లీ ఒక్కసారిగి అధిక సంఖ్యలో వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.