ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భారీ అవినీతి బయటపడింది. దీన్ని ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి స్వయంగా వెల్లడించడం గమనార్హం. లడ్డూల తయారీకి వినియోగించే సరుకుల కొనుగోళ్లలో లక్షలాది రూపాయల అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువ ధరలకు కాంట్రాక్టర్ సరుకు సరఫరా చేస్తున్నారని, రేటు ఎక్కువ పెట్టినా సెకండ్ గ్రేడ్ క్వాలిటీ
అంటగడుతున్నారని తెలిపారు. నవంబర్ నెలలో రూ. 42 లక్షల గోల్ మాల్ జరిగిందనే విషయం తమ అంతర్గత విచారణలో తెలిసిందని, దీన్ని దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే కాంట్రాక్టర్ కి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని గత నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించామని స్పష్టం చేశారు. కానీ, ఇంతవరకు కాంట్రాక్ట్ రద్దుకు సంబంధించి దేవాదాయ కమిషనర్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోవు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోటి రూపాయలు తేడా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.