ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, దివంగత చక్రి సోదరుడు, పుట్టుకతో వికలాంగుడైన మాధవరావు అలియాస్ మహిత్ నారాయణ్ సదరం సర్టిఫికెట్ కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంప్లతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయాడు. మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లికి చెందిన మాధవరావు పై చదువులకోసం హైదరాబాద్ వచ్చి, ప్రస్తుతం బంజారాహిల్స్లో నివాసం ఉంటున్నాడు. వీల్ చైర్పైనే తన దైనందిన కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నాడు.
సోదరుడైన చక్రి వద్ద నేర్చుకున్న సంగీతంతో ఓ సంగీత స్టూడియో పెట్టుకుందామని అనుకుంటున్నాడు. అందుకోసం వికలాంగుల కోటాలో బ్యాంకు లోను కోసం ప్రయత్నించగా, సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని బ్యాంకు వాళ్లు తేల్చి చెప్పారు. దీంతో సదరం సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.