ఛలో అసెంబ్లీ భగ్నం - MicTv.in - Telugu News
mictv telugu

ఛలో అసెంబ్లీ భగ్నం

October 27, 2017

రైతాంగంతోపాటు వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ తలపెట్టిన ఛలో అసెంబ్లీని తెలంగాణ పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

చలో అసెంబ్లీకి అనుమతి లేదని నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజే ఈ ఆందోళన చేపట్టడంతో సర్కారు తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని హెచ్చరించింది. దీంతో పోలీసులు పకడ్బందీగా ఛలో అసెంబ్లీని అడ్డుకున్నారు.

నగర శివారుల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. గాంధీభవన్ నుంచి బయల్దేరిన పొన్నం ప్రభాకర్, గండ్ర తదితరులను అరెస్ట్ చేశారు. జిల్లాల్లోనూ అరెస్ట్ పర్వాలు సాగాయి. కొందరిని గృహనిర్బంధం చేశారు. ఉత్తమ్ కుమార్, డీకే అరుణ, సబితా, సునీతా లక్ష్మారెడ్డిలను కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పొన్నం, గండ్ర, మహేష్ కుమార్ గౌడ్, గూడూరుతో పాటు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రాష్ట్రం కోసం పోరాడిన రైతుల్నే అరెస్ట్ చేస్తారా?

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే అసెంబ్లీ ముట్టడిని చేపట్టామన్నారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.