భలే న‌వ్విస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

భలే న‌వ్విస్తుంది

February 2, 2018

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’తో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైన నాగ‌శౌర్య  లవ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.  స‌హ‌జ‌త్వ ప్రేమ‌క‌థ‌ల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నాడె. అయితే గ‌త‌ కొంత‌కాలంగా ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొడుతూ వ‌చ్చాయి. మాస్‌, మ‌ల్టీస్టార‌ర్ అంటూ అనేక ప్ర‌యోగాలు చేసినా అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో నాగ‌శౌర్య‌కో మంచి విజ‌యాన్ని అందించి కొడుకు కెరీర్ నిల‌బెట్టే బాధ్య‌త‌ను అత‌డి త‌ల్లిండ్రులైన ఉషా మూల్పూరి, శంక‌ర్‌ప్ర‌సాద్ తీసుకున్నారు. కొడుకుతో ఛ‌లో సినిమాను నిర్మించారు. వినోదాత్మ‌క ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంతో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

హ‌రి(నాగ‌శౌర్య‌) అల్ల‌రి కుర్రాడు. నిత్యం గొడ‌వ‌ల్లో త‌ల‌దూర్చుతుంటాడు. హ‌రిలో మార్పు తీసుకురావ‌డం కోసం అత‌డి త‌ల్లిదండ్రులు  ఆంధ్రా, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లో ఉన్న తిరుప్పురం అనే ఊరిలోని కాలేజీలో చేర్పిస్తారు. ఆ ఊరిలో తెలుగు వారికి, త‌మిళుల‌కు కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌గాదాలు జ‌రుగుతుంటాయి. కంచె వేసి ఊరిని రెండు భాగాలుగా విభ‌జిస్తారు.  ఒక‌రివైపు మ‌రొక‌రు రాకూడ‌ద‌నే ష‌ర‌తులు విధించుకుంటారు.  తెలుగువారికి కేశ‌వులు నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తే తమిళుల‌కు వీర‌ముత్తు  అధిప‌తిగా ఉంటాడు. తిర‌ప్పురంలోని కాలేజీలో అడుగుపెట్టిన హ‌రి తొలిచూపులోనే కార్తీక(ర‌ష్మిక మంద‌న‌) అనే అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌ను కోరుకున్న ల‌క్ష‌ణాలు హ‌రిలో ఉండ‌టంతో కార్తీక కూడా హ‌రిని ప్రేమిస్తుంది.  త‌న తండ్రి అంగీక‌రిస్తేనే త‌మ పెళ్లి జ‌రుగుతుంద‌ని కార్తీక ష‌ర‌తుకు అంగీక‌రించిన హ‌రి ఆమె ఇంటికి వ‌స్తాడు. త‌ను అనుకుంటున్న‌ట్లు కార్తీక తెలుగు అమ్మాయి కాద‌ని త‌మిళ ప్ర‌జ‌ల నాయ‌కుడైన వీర‌ముత్తు కూతుర‌నే నిజం ఆమె ఇంటికి వెళ్లిన త‌ర్వాతే హ‌రికి అర్థ‌మ‌వుతుంది. హ‌రి తెలుగ‌బ్బాయి కావ‌డంతో అత‌డిని చంప‌డానికి కార్తీక తండ్రి వారి పెళ్లికి అడ్డుచెబుతాడు. త‌న ప్రేమ‌ను గెలుపించుకోవ‌డం కోసం హ‌రి ఏం చేశాడు? అస‌లు తిర‌ప్పురుం రెండుగా ఎందుకు విడిపోయింది? ఆ ఊరి ప్ర‌జ‌ల‌ను హ‌రి ఎలా ఏకం చేశాడ‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

భాషలు, స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉన్న అంత‌రాల‌నేది చాలా సున్నిత‌మైన అంశం. ఆ పాయింట్‌ను  ఆద్యంతం వినోద‌భ‌రితంగా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.  మ‌ద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవ‌డంతో అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండే రెండు భాష‌ల‌కు చెందిన ప్ర‌జ‌ల మ‌ధ్య ఏర్ప‌డిన వైరం అనే పాయింట్‌కు అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను జోడించి సినిమాను తెర‌కెక్కించారు. హీరో పాత్ర ప‌రిచ‌యం తాలూకు స‌న్నివేశాల‌తో రొటీన్‌గా మొద‌లైన క‌థ తిరుప్పురంలో క‌థానాయ‌కుడు అడుగుపెట్ట‌డంతో ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అక్క‌డ ఊరి ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే త‌గాదాలు, కాలేజీలో త‌మిళుల‌కు, తెలుగు విద్యార్థుల‌కు మ‌ధ్య ఉండే పోటీని చూపించే స‌న్నివేశాలు చ‌క్క‌టి వినోదాన్ని పంచుతాయి.  తెలుగు అమ్మాయ‌నే అపోహ‌తో హీరోయిన్‌తో హీరో ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ క్ర‌మంలో అత‌డు చేసిన పొర‌పాటు అనే ఉత్కంఠ‌భ‌రిత‌మైన మ‌లుపుతో ప్ర‌థ‌మార్ధాన్ని ముగించిన  ద‌ర్శ‌కుడు ఆ ఆస‌క్తిని ద్వితీయార్ధంలో కొన‌సాగించ‌లేక‌పోయారు.

క‌థ అక్క‌డే ఆగిపోయిన భావ‌న క‌లుగుతుంది. హీరోను ధైర్య‌వంతుడిగా చూపిస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కుడు నిస్స‌హ‌యుడిగా మార్చేస్తాడు. హీరోయిన్ పెళ్లిని ఆప‌డానికి ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా స్నేహితుల‌తో క‌లిసి మందుపార్టీల స‌న్నివేశాల‌తో నింపారు. దాంతో స్పీడుతో వెళ్లిన సినిమా క‌థాగ‌మ‌నానికి ఒక్క‌సారిగా బ్రేకుల‌ప‌డ‌తాయి. సినిమాను సాగ‌తీస్తూ వెళ్లిన‌ట్ల‌నిపిస్తుంది.  ప‌తాక ఘ‌ట్టాల వ‌చ్చేవ‌ర‌కు ఏదో  స‌న్నివేశంతో ద‌ర్శ‌కుడు కాల‌క్షేపం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.  చివ‌ర‌లో ఏదో హ‌డావిడిగా సినిమాను ముగించారు. ఊరిని క‌ల‌ప‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నాలు, ఊరు రెండుగా విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల్లో ఉత్కంఠ‌త‌, కామెడీ  లోపించాయి. కేవలం వినోదంపై ఎక్కువ‌గా దృష్టిసారించిన ద‌ర్శ‌కుడు మిగ‌తా ఎమోష‌న్స్‌ను ప‌ట్టించుకోలేదు. వాటిపై దృష్టిసారిస్తే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. నాయ‌కానాయిక‌లు ప్రేమ‌లో ప‌డే స‌న్నివేశాలు సాధారణంగా ఉన్నాయి. వారి మ‌ధ్య రొమాన్స్ స‌రిగా చూపించ‌లేక‌పోయారు.

వినోదాన్ని ఆవిష్క‌రించే విష‌యంలో ద‌ర్శ‌కుడిపై త్రివిక్ర‌మ్ ప్ర‌భావం చాలానే ఉంది. సంభాష‌ణ‌ల‌తో ఎక్కువ‌గా న‌వ్వించాల‌ని ప్ర‌య‌త్నించారు. అవి చాలా చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యాయి. అవే ఈ సినిమాను నిల‌బెట్టాయి. స‌త్య‌, వైవాహ‌ర్ష‌, సుద‌ర్శ‌న్ క‌నిపించే స‌న్నివేశాలు, పోసానిపై చిత్రీక‌రించిన కాలేజీ ఎపిసోడ్‌, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఆక‌ట్టుకుంటాయి.అయితే  ఆ వినోదాల్ని ఆసాంతం కొన‌సాగించ‌లేక‌పోయారు. వైవిధ్య‌మైన పాయింట్‌ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు చివ‌ర‌కు రొటీన్‌గా క‌థ‌ను ముగించిన తీరు బాగాలేదు.

ఇప్ప‌టివ‌ర‌కు ల‌వ‌ర్‌బాయ్‌, ప‌క్కింటికుర్రాడి త‌ర‌హా పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించాడు నాగ‌శౌర్య. త‌న పంథాకు భిన్నంగా ఈ సినిమాలో ఆవేశ‌ప‌రుడైన యువ‌కుడిగా చక్క‌టి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అత‌డి పాత్ర‌ను స్టైలిష్‌గా తీర్చిదిద్దిన విధానం బాగుంది.  ర‌ష్మిక మంద‌న త‌న అందంతో ఆక‌ట్టుకుంది. అభిన‌యం విష‌యంలో ప‌ర్వాలేద‌నిపించింది. స‌త్య పాత్ర ఈ సినిమాకు వెన్నుముక‌గా నిలిచింది. త‌న‌దైన శైలి డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అత‌డిపై చిత్రీక‌రించిన ప్ర‌తి స‌న్నివేశం న‌వ్విస్తుంది. అలాగే వెన్నెల కిషోర్, వైవాహ‌ర్ష, సుద‌ర్శ‌న్ కామెడీ బాగుంది. ర‌ఘుబాబు పాత్ర ద్వారా కామెడీతో పాటు ఎమోష‌ను పండించిన తీరు మెప్పిస్తుంది. త‌మిళ నేటివిటీలో స‌హ‌జ‌త్వం కోసం అక్క‌డి న‌టుల‌నే తీసుకున్నారు ద‌ర్శ‌కుడు. గుండు  రాజేంద్ర‌న్ త‌దిత‌రులు త‌మ న‌ట‌న‌తో మెప్పించారు.

సాంకేతికంగా ఛాయాగ్ర‌హ‌కుడుసాయిశ్రీ‌రామ్ ఈ సినిమాకు హీరోగా నిలిచాడు. ప్ర‌తి ఫ్రేమ్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. తిర‌ప్పురం కాలేజీ అందాలు,కూర్గ్‌లో చిత్రీక‌రించిన పాట, హీరోయిన్ ఇల్లు ఇలా ప్ర‌తి స‌న్నివేశం క‌నుల‌విందుగా ఉంటుంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌బాణీల‌లో చూసి చూడంగానే ఆక‌ట్టుకుంటుంది. నేప‌థ్య సంగీతం బాగుంది. త‌మ కొడుకుకు ఓ పెద్ద‌  విజ‌యం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నంలో ఉషా, శంక‌ర్‌ప్ర‌సాద్ ఎక్క‌డ రాజీపడ‌కుండా సినిమాను భారీగా తెర‌కెక్కించారు. అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు చేశారు.

రెగ్యుల‌ర్ కామెడీ సినిమాల‌తో పోలిస్తే విభిన్న‌మైన అనుభూతిని పంచుతుంది, క‌థ‌, క‌థ‌నాల్లోని వైవిధ్య‌ం ఆక‌ట్టుకుంటుంది. కానీ చిన్న చిన్న లోపాలు ఉండ‌టం, ద‌ర్శ‌కుడి అనుభ‌వ‌లేమి కార‌ణంగా సాధార‌ణ సినిమా నిలిచింది. లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి స‌ర‌దాగా న‌వ్వుకునే వారిని త‌ప్ప‌కుండా ఈ సినిమా మెప్పిస్తుంది. టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలుస్తుంది.

రేటింగ్‌:2.75/5