పాక్‌తో మ్యాచ్‌కి వాన గండం.. టెన్షన్‌లో ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌తో మ్యాచ్‌కి వాన గండం.. టెన్షన్‌లో ఫ్యాన్స్

October 22, 2022

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ శనివారం మొదలైంది. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్‌లు ఈ మ్యాచ్‌లో తలపడుతుండగా, ఆదివారం టోర్నీలోనే అతిపెద్ద మ్యాచ్ భారత్ – పాకిస్తాన్‌ల మధ్య జరుగనుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 90 వేల సీట్ల సామర్ధ్యం ఉండే ఆ స్టేడియంలో టిక్కెట్లు కొన్ని నెలల కింద పది నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచుకు ఇప్పుడు వాన గండం పొంచి ఉంది.

ఆదివారం భారీ వర్షం కురిసేందుకు 90 శాతం అవకాశాలున్నాయని ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది. ఉదయం, సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడవచ్చని సూచించింది. ఇది నిజమన్నట్టుగా శుక్ర, శనివారాల్లో వరుసగా వర్షం పడుతూనే ఉంది. కనీసం 10 నుంచి 25 మిల్లీ లీటర్ల వర్షం కురిస్తే చెరో 5 ఓవర్ల ఆట కూడా సాధ్యపడదని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామని, ఆదివారం వరుణ దేవుడు కరుణిస్తాడనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. అటు లీగ్ స్థాయిలో జరిగే మ్యాచుకు రిజర్వ్ డే లేకపోవడంతో ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఇది టోర్నీలో భారత్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్రూపులోని మిగతా జట్లు ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుందో ఆదివారం వరకు వేచి చూడాలి.