సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్.. జబర్దస్త్‌కు కెమెరామెన్‌నని చెప్పి.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్.. జబర్దస్త్‌కు కెమెరామెన్‌నని చెప్పి..

July 12, 2020

Movie Chance

కరోనా సంక్షోభంలోనూ పిచ్చి కుక్కల మాదిరి దోచుకోవడానికి తయారయ్యారు కొందు కేటుగాళ్లు. మొన్న టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరిటి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ ఛాన్స్ అంటూ మోసానికి తెరలేపారు. ఈ విషయమై ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ‘ఆత్రేయపురం ప్రేమకథ’ అనే సినిమా పేరిట రావణ్ భిక్షు అనే వ్యక్తి  అమ్మాయిలను టార్గెట్ చేశాడు. చైతన్య క్రియేషన్ బ్యానర్‌పై సినిమా అంటూ రావణ్ భిక్షు యువతులకు వల విసిరాడు. అమరావతి పుణ్యక్షేత్రంలో సినిమా ప్రారంభిస్తున్నామంటూ ప్రచారం చేశాడు. హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని నమ్మబలికాడు. దీంతో విజయవాడ, గుంటూరుకి చెందిన యువతులు అతన్ని ఆశ్రయించారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కొంతకాలం పాటు కెమెరామన్‌గా పనిచేశానంటూ చెప్పుకునేవాడు.

యువతుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని భిక్షు లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై బాధితులు మీడియాను ఆశ్రయించగా, మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓ బాధితురాలితో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితులకు తాము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మోసగాళ్లను పట్టుకుని కఠిన శిక్ష వేస్తామని తెలిపారు.