ఈసారి వేసవి ఫిబ్రవరి ఆఖరి నుంచే తన ప్రతాపం చూపిస్తోంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ దాటికి జనాలు బయటకు ఎక్కువగా రావడం లేదు. గతేడాది కంటే ఈసారి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. వేసవి తాపానికి అలాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందట.
రాష్ట్రంవైపు తూర్పు, ఆగ్నేయదిశల నుంచి గాలులువీస్తున్నాయని, వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న సూచించారు. 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందన్నారు. 17న మాత్రం ముందుగా చెప్పుకున్న ప్రాంతాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్‌లలో కూడా వర్షాలు మరింత భారీగా కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు.