చందా కొచ్చర్.. భర్త.. రూ.3250 కోట్ల ఎగవేత! - MicTv.in - Telugu News
mictv telugu

చందా కొచ్చర్.. భర్త.. రూ.3250 కోట్ల ఎగవేత!

March 29, 2018

విజయ్ మాల్యా, నీరవ్ మోదీల అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు దేశంలో చాలామందే ఉన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంతో కుంభకోణాల డొంకలు కదులుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐలో భారీ స్కాం వెలుగుచూసింది. అదికూడా సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌పైనే ఆరోపణలు గుప్పుమన్నాయి. క్విడ్ ప్రో క్రో కింద రూ. 3250 కోట్లు రుణాలు ఇచ్చి, మాఫీ చేసినట్లు తెలుస్తోంది.

వీడియోకాన్ గ్రూప్ నేత వేణుగోపాల్ ధూత్‌, చందా భర్త దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు 2008లో ఓ కంపెనీని స్థాపించారు. 2012లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌కు రూ.3250 కోట్ల రుణం అందింది. తర్వాత వేణుగోపాల్‌ తన వాటాను దీపక్‌ కొచ్చర్‌కు బదిలీ చేశారు. ఐసీఐసీఐ ఇచ్చిన రుణంలో రూ.2810 కోట్లు ఈ గ్రూప్‌ ఎగ్గొట్టింది.

2017లో రుణాన్ని రాని బకాయిగా ప్రకటించేశారు. ఐసీఐసీఐ, ఇతర బ్యాంకులు కలిపి వీడియోకాన్‌కు రూ.36వేల కోట్ల అప్పులిచ్చాయి. క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు కొచ్చర్‌ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబీకులు లబ్ది పొందారని వార్తలు వస్తున్నాయి. అయితే ఐసీఐసీఐ వీటిని తోసిపుచ్చింది. వీడియోకాన్‌కు రుణమివ్వాలనే నిర్ణయం చందాకొచ్చర్‌ ఒక్కరిదే కాదని, బ్యాంకు క్రెడిట్‌ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుందని తెలిపింది. కాగా, ఈ స్కాం గురించి ప్రధాని మోదీకి రెండేళ్ల కిందటే తెలుసని సమాచారం. 2014లో వేణుగోపాల్ బీజేపీకి రూ. 11 కోట్ల విరాళం ఇచ్చారు.