Chandigarh airport to be renamed after Shaheed Bhagat Singh: PM Narendra Modi
mictv telugu

ఆ విమానాశ్రయానికి కొత్త పేరు ప్రకటించిన ప్రధాని

September 25, 2022

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్‌ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, భగత్‌సింగ్‌కు మరింత గౌరవం కల్పించే ఉద్దేశంతో పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్‌లో భాగంగా 90వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన మోదీ.. వాతావరణ మార్పులు, ఇటీవల భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు వంటి విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ జయంతి జరుపుకోనున్న వేళ సమరయోధుడికి నివాళిగా చంఢీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.

వాతావరణ మార్పు జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. సముద్ర తీర ప్రాంతాలకు వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయన్నారు. బీచ్‌లలో చెత్త పేరుకుపోవడం కలవరపెట్టే విషయమన్నారు. ఇలాంటి తీవ్ర సవాళ్లను మనందరి బాధ్యతగా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. సుదీర్ఘ కాలం తర్వాత దేశంలోకి చీతాలు రావడంపై దేశవ్యాప్తంగా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేశారన్న ప్రధానమంత్రి.. చీతాలను ఎప్పటినుంచి చూడవచ్చనే దానిపై వాటిని పర్యవేక్షిస్తోన్న టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.