ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు రాజధాని పర్యటన - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు రాజధాని పర్యటన

November 28, 2019

టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన అమరావతి పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన రాకను కొంత మంది వ్యతిరేకిస్తుండగా మరికొంత మంది స్వాగతించారు. రెండు వర్గాల పోటాపోటీ నినాదాలతో రాజధాని ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్ అడ్డుకునేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా అడ్డుతగిలారు. దీంతో వారిని పోలీసులు చదరగొట్టారు. అదే సమయంలో కొంత మంది చెప్పులు, రాళ్లు విసరడంతో బాబు ప్రయాణిస్తున్న బస్సు స్వల్పంగా ధ్వంసం అయింది. 

Chandrababu.

కాగా వైసీపీ కార్యకర్తలు మాత్రమే బాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు ఎవరూ ఆయన్ను వ్యతిరేకించడం లేదన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై అచ్చన్నాయుడు మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. 

Chandrababu

బాబు ప్రయాణిస్తున్న బస్సు వెంకటపాలెంలోకి అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలంలోని మట్టికి చంద్రబాబునాయుడు నమస్కరించారు.5 కోట్ల ఆంధ్రుల కోసం చేపట్టిన రాజధాని నిర్మాణంపై వైసీపీ దుష్ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి కుట్రలు తిప్పికొట్టేందుకే తాను అమరావతి పర్యటనకు వస్తున్నానని తెలిపారు.