సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నారావారిపల్లెలో కుటుంబసభ్యులు, వియ్యంకుడు బాలయ్య కుటుంబాలతో భోగీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం 1ని మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ‘పండుగపూట మా కార్యకర్తలను జైల్లో పెట్టావు. భవిష్యత్తులో నువ్వెక్కడుంటావో ఊహించుకో. ఈ భూమిపై ఎక్కడున్నా వదలను. తీసుకొస్తా. ఇంతవరకు నా సున్నితత్వాన్నే చూశారు. ఇక నుంచి నా కఠినత్వాన్ని చూస్తారు. వడ్డీతో సహా తీర్చుకుంటాం’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అటు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, తన జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. రైతులు, దళితులు చితికిపోయారని, భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసేలా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలని విమర్శించారు. ఇక నారావారిపల్లెలో శనివారం బాలయ్య మార్నింగ్ వాక్ కి వెళ్లారు. దారిలో పలువురిని పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం భోగి మంటల వద్ద స్థానికులతో మాట్లాడి సినిమాల పండుగ అయిన సంక్రాంతి రోజున అందరూ వీరసింహారెడ్డి సినిమా చూడాలని కోరారు.