టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది.దాదాపు గంటన్నర సేపు ఇరువురూ సమావేశమయ్యారు. కుప్పం పర్యటనలో చంద్రబాబుని అడ్డుకోవడంపై పవన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఇద్దరు నాయకులూ మీడియా సమావేశంలో మాట్లాడారు.జీవో నెంబర్ 1పై ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు. పొత్తులపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి వణుకెందుకు ?
పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై భేటీలో చర్చించినట్టు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. జీవో నంబర్ 1పై ఎలా పోరాడాలి అనే దానిపై చర్చించామని.. భవిష్యత్తులో ఈ జీవోను వెనక్కు తీసుకునేలా ఏం చేయాలనేది చంద్రబాబుతో మాట్లాడినట్లు పవన్ తెలిపారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో చెత్త జీవోలను తెస్తున్నారని మండిపడ్డారు. “పెన్షన్లు ఇష్టానుసారం తొలగిస్తున్నారు. రైతులుకు మద్దతు ధర కల్పించడం లేదు. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వైజాగ్లో నన్ను నిర్భందించారు.ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి పట్ల..ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గం. నేను వారాహి కొనుక్కుంటే మీకేం ఇబ్బంది. మీరు మాత్రం కోట్ల రూపాయలు పెట్టి వెహికల్స్ కొనుక్కోవచ్చు. నేను బ్యాంకులో లోన్ తీసుకొని వారాహి కొనుక్కున్నాను. ప్రచార వెహికల్ తీసుకోవడం సహజం. నేను బయట అడుగుపడితే వైసీపీ నాయకులకు ఎందుకంత భయం ” అని పవన్ ప్రశ్నించారు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీని స్వాగతిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు.
టీడీపీ సభల్లో కుట్ర
సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా జీవితం అంధకారంగా మారిపోయిందని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో నన్ను అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు. “మొన్న కందుకూరు, తర్వాత గుంటూరులో జరిగింది వైసీపీ కుట్ర… దీన్ని అమలు చేసింది పోలీసులు. ఆ తర్వాత కావలి వెళ్లాను, కోవూరు వెళ్లాను… అక్కడికి ఇంకా ఎక్కువమంది జనం వచ్చారు. కానీ అక్కడ పోలీసులు ఉండడంతో ఎలాంటి ఘటనలు జరగలేదు. సినీ నటుడో, రాజకీయ నేతో వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తే శాంతిభద్రతలు చేపట్టాల్సిన బాధ్యత పోలీసులదే” అని చంద్రబాబు అన్నారు.
పొత్తులపై కీలక వ్యాఖ్యలు
ఇక పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాల్లో సమీకరణాలు బట్టి పొత్తులు ఉంటాయి. 2009లో బీఆర్ఎస్తో పొతు పెట్టుకున్నాం. తర్వాత బీఆర్ఎస్తో విభేదించాం. పొత్తులపై తర్వాత చర్చిస్తాం. రాజికీయాల్లో పొత్తుల సహజమే. ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మాకు వ్యూహాలు ఉంటాయి” అని చంద్రబాబు పేర్కొన్నారు.