బాబు భయపడ్డాడా? భయపడాల్సి వచ్చిందా? భయపడినట్లు నటిస్తున్నాడా? - MicTv.in - Telugu News
mictv telugu

బాబు భయపడ్డాడా? భయపడాల్సి వచ్చిందా? భయపడినట్లు నటిస్తున్నాడా?

March 7, 2018

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆక్రోశం, ఆందోళన ప్రభావం చూపుతోంది. నాలుగేళ్లుగా పోరాడుతున్నా స్పందించకుండా ప్యాకేజీ అని, నిధులు అని అటు కేంద్రం, సామరస్యంగా సాధిద్దాం, ప్యాకేజీ సరిపోతుందిలే అని చంద్రబాబు చెబుతున్న మాటలతో విసుగెత్తిన జనం రోడ్లపైకి రావడంతో టీడీపీ దిగొచ్చింది. ఎన్నికలు దగ్గర పడడం, రాష్ర్ట సర్కారుపై తీవ్ర విమర్శలను పరిగణనలోకి తీసుకున్న బాబు ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ నుంచి తమ మంత్రులను బయటికి రప్పించారు.

అందరూ ఏకం కావడంతో..

ఎన్నికలు దగ్గర పడ్డంతో ఏపీలో హోదా రాజకీయం ఊపందుకుంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అటు ప్రధాన విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. పార్లమెంటులో పార్టీ ఎంపీలతో హోరెత్తిస్తున్నారు. మరోపక్క.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి వరసు సమావేశాలు పెడుతూ ఏపీ సర్కారును విమర్శిస్తున్నాడు. బీజేపీ నేతలు కూడా టీడీపీపై భగ్గమంటున్నారు. ఏ రాష్ట్రానికీ చేయని సాయాన్ని ఏపీకి చేశామని, కేంద్రం నిధులను బాబు పక్కదారి పట్టించి లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. మరోపక్క రాయలసీమలో ప్రత్యేక హైకోర్టు ఉద్యమం రాజుకుంటోంది. రోజూ ఏపీలో పలు ప్రాంతాల్లో హోదా ర్యాలీలు, ధర్నాలు సాగుతున్నాయి. చివరికి టీఆర్ఎస్ పార్టీ సైతం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వ్యూహాత్మక మద్దతు ప్రకటించింది. హోదాపై పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృతంగా కవరేజీ వస్తోంది. చర్చలు, వాగ్వాదాలు మిన్నంటుతున్నాయి. అందరూ బీజేపీతోపాటు బాబును ప్రధాన ముద్దాయిగా చూపిస్తున్నారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గత్యంతరం లేక..

ఇవన్నీ సునిశితంగా గమనించిన బాబు.. ఇప్పట్లో కీలక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో అసలుకే మోసం వస్తుందని రాజీనామాల నిర్ణయం తీసుకున్నారు. హోదా ఉద్యమం ఇదివరకట్లా మంద్రస్థాయిలో ఉండుంటే ఆయన అశోక్ గజపతి, సుజనా చౌదరిలను ఎన్నికలు అయ్యేంతవరకు కేంద్ర కేబినెట్లోని ఉంచేవారు. రాజీనామా నిర్ణయం బాధాకరమని బాబు పదేపదే అనడంలో.. గత్యంతరం లేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కేసీఆర్‌కు మంత్రిపదవి ఇవ్వకపోవడం, తెలంగాణపై రెండుకళ్ల సిద్ధాంతం వంటి అంశాల్లో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఎదురైన కష్టనష్టాలను బాబు బాగా బేరీజు వేసుకుని, ముందస్తు జాగ్రత్తతో తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఫలితంలేని ఎంపీల నిరసన..

గత పార్లమెంటు సమావేశాల్లో హోదా కోసం నినదించిన టీడీపీ ఎంపీల యత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. తాజా సమావేశాల్లోనూ అదే పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ వర్గాలు నిన్నటినుంచే లీకులు ఇస్తూ వచ్చాయి. ఈ రోజు జైట్లీ ఆ మాటలనే స్పష్టం చేశారు. సెంటిమెంట్‌కు తలొగ్గి హోదా ఇచ్చే ప్రసక్తే లేదని, నిధులు, ప్యాకేజీతో సరిపెట్టుకోవాలని తెగేసి చెప్పండం బాబుకు ఆగ్రహం కంటే బాధనే ఎక్కువగా కలిగించింది. ఈ అంశంపై మాట్లాడడానికి మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఆయన ఎన్డీఏ నుంచి బయటికి రానని కూడా స్పష్టం అవుతోంది. మోదీతో మాట్లాడేందుకు యత్నిస్తున్నామని, ఇది బాధాకర సందర్భమని వివరణ ఇవ్వడం దీనికి సంకేతం. ఎన్నికలకు ఏడాది వ్యవధి కూడా లేకపోవడం, హోదాను ఇవ్వబోమని కేంద్రం చెప్పడంతో ఇక కేంద్ర కేబినెట్ లో ఉండి సాధించేదీమీ లేదని, బయటికి వస్తే కనీసం చేయాల్సింది చేశామని భావనను ప్రజల్లో కలిగించినట్లువుతుందని బాబు  భావించినట్లు కనిపిస్తోంది.

హోదా ఉద్యమ సెగలతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతామన్న భయం, భయపడాల్సిన సందర్భం, తాను ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్లు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అన్నీ కలిసి టీడీపీని కేంద్ర కేబినెట్ నుంచి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి కల్పించాయి.