chandrababu fire on cm ys jagan
mictv telugu

నేను ఎస్వీయూలో చదువుకున్నా..జగన్ ఎక్కడ చదివాడో చెప్పాలి ? :చంద్రబాబు

November 17, 2022

chandrababu fire on cm ys jagan

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఆదోనిలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడు. నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయాం. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారు. “నేనేమీ సినిమా యాక్టర్ కాదు… నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టీడీపీ రావాలి అని సంఘీభావం తెలిపేందుకు వీరంతా వచ్చారు”

రాష్ట్రంలో రౌడీయిజం పేట్రేగిపోతుంది. దోపిడీ, నేరాలు పెరిగిపోయాయి. వైసీపీ పాలనలో పోలీసులు కూడా అలానే తయారయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబం బెదిరించడంతో ఆత్మహత్య చేసుకొని ఇద్దరు చనిపోయారు. “చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిని ఏమనాలి?. మద్యం, ఇసుక మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో పత్తి రైతులను ముంచారు. భయం లేని ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు.” అని చంద్రబాబు మండిపడ్డారు. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశాను. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడు?” అంటూ ప్రశ్నించారు.

“పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పోతే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట. రేపు మేము కూడా వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా…ఫ్లైవోవర్ లు కట్టలేమా? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ చానల్స్ ను ఉన్మాది జగన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను ఆరోజు ఇలా చేసి ఉంటే సాక్షి టివి, సాక్షి పేపర్ వచ్చేదా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమం నిలిపివేస్తామని టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు.