Chandrababu good news for sitting MLAs..
mictv telugu

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్‌న్యూస్..

September 16, 2022

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటన చేశారు. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..”ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారందరికీ టికెట్లు ఖాయం. ప్రజల్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అతని వైఫల్యాలను ఎమ్మెల్యేలపైకి నెట్టేయాలని జగన్ చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లోనే కొందరు టికెట్ రాదని భయపడుతున్నారు. మరికొందరు వచ్చినా గెలవలేమని ఆందోళన చెందుతున్నారు. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం వద్దు. ప్రజా సమస్యలపై ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటమే మిమ్మల్ని గెలిపిస్తుంది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సహా అందరి అమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశాం. ఇప్పుడాయన అమరావతిపై మడమ తిప్పారు. స్వార్థ రాజకీయాల కోసం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం జగనకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి, జగన్ తీవ్ర నిస్పృహలో ఉన్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.