హైదరాబాద్ మెట్రో కూడా నా ఘనతే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ మెట్రో కూడా నా ఘనతే

November 29, 2017

అన్ని ఘనతలను తన ఖాతాలో వేసుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఆలస్యం లేకుండా తన ఖాతాలో వేసుకున్నారు. మెట్రో రైల్ కూడా తన ఘనతేనని చెప్పుకొచ్చారు.

‘హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం నా హయంలో పోరాటం చేశాను.. మెట్రో ప్రాజెక్టులను బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలకే పరిమితం చేశారప్పుడు.. అయితే నేను ఎంతో పోరాడి హైదరాబాద్‌ను ఆ జాబితాలో చేర్పించాను. అందువల్లే మెట్రో రైలు హైదరాబాద్‌కు వచ్చింది…’ అని అన్నారు.  ఆయన బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 కర్ణాటక, గుజరాత్‌ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయన్నారు. తన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మెట్రోను ఆలస్యం చేశారని,  అందుకే ఇంతకాలం పట్టిందని ఆరోపించారు..‘నేను  అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీధరన్‌తో హైదరాబాద్‌ మెట్రోపై తీవ్ర అధ్యయనం చేయించాం.

హైదరాబాద్‌ అభివృద్ధి చరిత్రపై మా ముద్ర పోయేది కాదు. మెట్రో రైలుతో పాటు జీఈఎస్‌ జరుగుతున్న హెచ్‌ఐసీసీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు… ఇవన్నీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవే. నేను ప్రారంభించినా…ప్రారంభించకున్నా… హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామన్న సంతృప్తి నాకుంది…’ అని ఆయన అన్నారు.