విజయవాడలో చంద్రబాబు దీక్ష.. పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో చంద్రబాబు దీక్ష.. పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

November 14, 2019

టీడీపీ చీఫ్ చంద్రబాబు ‘ఇసుక దీక్ష’ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో  దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ఇసుక విధానానికి నిరసనగా 12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ముగిసిన తర్వాత ఆయన ఇసుక  కొరతపై మాట్లాడనున్నారు. ఆయన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు వస్తున్నారు. 

దీక్షలో పాల్గొనే ముందు జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. నవరత్నాల పేరుతో వైసీపీ 9 రకాల మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్లు వేసిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. సర్కార్ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో 125 వృత్తులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.