Chandrababu made interesting comments on Cyberabad
mictv telugu

నేనేమీ హైదరాబాదుని నిర్మించలేదు.. కానీ ఆ పేరు పెట్టింది నేనే

November 10, 2022

Chandrababu made interesting comments on Cyberabad

టీటీడీపీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గురువారం ఎన్టీఆర్ భవన్‌‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు.. బీసీలు టీడీపీకి వెన్నెముక అని తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద. హైదరాబాద్ నడిబొడ్డున్ ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేశారు.

నీటికి కటకట ఉండే తెలంగాణలో ఎస్సెల్బీసీ, ఎస్సార్బీసీలను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. కల్వకుర్తి, దేవాదుల, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను నా హయాంలో ప్రారంభమయ్యాయి. ఐటీలో అవకాశాలను గమనించి నగరం చుట్టూ వందలాది ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పాను. సైబరాబాద్, హైటెక్ సిటీని అభివృద్ధి చేశాను. ఆ రోజు నేను నాటిన మొక్క నేడు మహా వృక్షమైంది. ఐటీ నిపుణులు ఆరంకెల జీతంతో పని చేస్తున్నారంటే అప్పుడు జరిగిన అభివృద్ధే కారణం’అని అభిప్రాయపడ్డారు. ఇంకా మాట్లాడుతూ.. ‘దేశంలో ఈ రోజు తెలంగాణ ముందుందంటే దానికి కారణం టీడీపీనే. నేనేమీ హైదరాబాద్ నగరాన్ని నిర్మించలేదు. అది నిర్మించింది నిజామే. కానీ, సైబరాబాద్ నిర్మించింది, దానికా పేరు పెట్టింది నేనే. దాని తర్వాత నగరం రూపురేఖలు మారిపోయాయి. దేశంలో మహానగరాలను కాదని అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రోను ఇక్కడికి తీసుకొచ్చాం. కరోనాలో ప్రజలను ఆదుకున్న గాంధీ ఆసుపత్రిని కట్టిందెవరు. నిమ్స్‌ను ఎయిమ్స్ రేంజులో డెవలప్ చేశాం. గచ్చిబౌలిలో నేను కట్టిన భవనాలను ఇప్పుడు టిమ్స్‌గా మార్చి వాడుకుంటున్నారు. విజన్ 2020 అంటే నవ్వినవాళ్లకు విజన్ అంటే ఏంటో ఇప్పటి హైదరాబాదును చూస్తే తెలుస్తుంది’ అని చంద్రబాబు వివరించారు. రెండు రాష్ట్రాలకు బీసీలే పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.