రాజీనామాయణంలో ప్రశంసల వేట.. బాబు, పైడికొండల కహానీ - MicTv.in - Telugu News
mictv telugu

రాజీనామాయణంలో ప్రశంసల వేట.. బాబు, పైడికొండల కహానీ

March 8, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ నుంచి తమ మంత్రులను టీడీపీ బైటికి తీసుకొస్తోంది. ఈ రోజు సాయంత్రం అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు మోదీని కలిసి రాజీనామాలు ఇస్తారు. దీంతో ఏపీ కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యారావులు కూడా రాజీనామా చేశారు.రాజీనామాల సందర్భంలో కూడా టీడీపీ, బీజేపీల అనుబంధం ఎక్కడా సడలనట్లు కనిపించింది. ఎన్డీఏ నుంచి ఇప్పుడిప్పుడే బయటు రాబోమని చంద్రబాబు స్పష్టం చేయడంతో కామినేని, పైడికొండలు కూడా బాబును పళ్లెత్తుమాట అనుకుండా, ఒకరంగా సంతోషంగానే రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును, చంద్రబాబు వారిని పరస్పరం ప్రశంసించుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. పైడికొండల, కామినేని తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని బాబు కొనియాడారు. దేవదాయ ధర్మదాయశాఖ మంత్రిగా మాణిక్యాలరావు కృష్ణా, గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించారని, దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దేవదాయ శాఖ ఆదాయం పెరిగేలా కృషి చేశారని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని చెబుతూ ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. మాణిక్యాలరావు కూడా చంద్రబాబును ప్రశంసిస్తూ.. సమర్థతలో ఆయనకు ఆయనే పోటీ అని పేర్కొన్నారు. బాబు సీఎం బాధ్యతలు చేపట్టకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చరని, పోలవరం ముంపు గ్రామాలను ఏపీకి సాధించి పెట్టారని అన్నారు. ‘చంద్రబాబు సామర్థ్యం, కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోంది. ఏపీకి బీజేపీ శత్రువు కాదు.. మిత్రుడే..’ అని అన్నారు.