ఉగాది పంచాంగాన్ని ప్రజలు ముందుగానే చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ప్రజా విజయమని అన్నారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను చాటారని చెప్పారు. ఈ తీర్పును తిరుగుబాటుగా చూడాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ నాలుగేళ్లలో విధ్వంస పాలన చేశారని విమర్శించారు. 40 ఏళ్లు చూడని అక్రమాలు ఈ నాలుగేళ్లలో చూశానని చెప్పారు. జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని ప్రజలు గమనించారని అన్నారు.. బాధ్యతతో ధైర్యంగా ముందుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. భవిష్యత్తులో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బాధ్యత లేని వ్యక్తి అని.. మోసాలు చేయడంలో దిట్ట అని విమర్శలు గుప్పించారు. జగన్ మళ్లీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.
పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు అన్నారు. జగన్ చేసే నేరాల్లో అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తలను, ఐఏఎస్ అధికారులను కూడా జగన్ జైలుకు పంపారని విమర్శించారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.. ఆయన మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయమని అన్నారు. కొన్ని పార్టీలు సిద్దాంతపరంగా రావని.. గాలికి వచ్చిన పార్టీ.. గాలికే కొట్టుకుపోతుందని వైసీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.