టీడీపీలో కొత్త వ్యవస్థను అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. కుటుంబ సాధికార సారథుల పేరిట ఉండే ఈ వ్యవస్థలో ప్రతీ 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమిస్తామని వెల్లడించారు. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రతీ నియోజకవర్గంల ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న చంద్రబాబు గురువారం జగ్గంపేట కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పైవిధంగా పేర్కొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని, ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. ఆర్ధిక అసమానతలు తొలగేలా సాధికార సారథి వ్యవస్థ పని చేస్తుందని, ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంఛార్జీలందరినీ సాధికార సారథులుగానే పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబానికి న్యాయం చేసేలా ఈ విభాగం పని చేస్తుందని తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ జగన్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తన పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వీరు ప్రతీ 50 కుటుంబాలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తున్నారు. అంతేకాక, వాలంటీర్లకు ప్రతీనెలా ప్రభుత్వం తరపున రూ. 5వేల గౌరవ భృతి వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థను వైసీపీ పార్టీకోసం వాడుకుంటోందని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలాంటి వ్యవస్థను పార్టీ తరపున తెస్తుండడంతో జగన్‌ని చంద్రబాబు కాపీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవస్థలు పార్టీలకు రాజకీయంగా ఎంతమేరకు ఉపయోగపడతాయో చూడాల్సి ఉంది.