విడాకులు ఇస్తాం.. కానీ సంసారం చేస్తాం ! - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు ఇస్తాం.. కానీ సంసారం చేస్తాం !

March 7, 2018

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తమ కేంద్ర మంత్రులు రేపు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్‌డీఏతో తమ స్నేహం కొనసాగుతుందని వివరించారు. ఈ విధానం ఏంటో అర్థం కాక నెటిజన్లు ‘విడాకులు ఇస్తాం కానీ సంసారం చేస్తాం’ అన్న చందంగా ఉందని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు మాట తీరు ఇంకా కేంద్రంపై  ఏదో మూల నమ్మకాన్ని కలిగి ఉన్నట్టు అర్థం అవుతుందని అంటున్నారు. పదవులు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అంటూనే బీజేపీ ఏపీ రాష్ట్ర కేబినేట్‌లో కొనసాగాలా? లేదా? అన్న విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ చంద్రబాబు సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. బీజేపీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లగొడతారా లేదా అనేది పెద్ద ప్రశ్నే. రాజీనామాల నిర్ణయం తిరుగుబాటు కాదని కేవలం నిరసన ప్రక్రియలో భాగమే అని చంద్రబాబు నొక్కి వక్కాణించడం అనుమానాలకు తావిస్తోంది.

రాజీనామాలపై నిర్ణయాన్ని మోదీకి ఫోన్లో వివరించే ప్రయత్నం చేశామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదని బాబు చెప్పడం.. కేంద్రంతో ఇంకా తమ అనుబంధం ఉంటుందనడానికి సంకేతమే. అయితే ఇటు ప్రజలను కూడా బుజ్జగించడానికి ఆయన యత్నిస్తున్నారు. మంత్రుల రాజీనామా తొలి హెచ్చరికే అని, దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందన్నదాన్నిబట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని బాబు అన్నారు.