టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణలోని గోదావరి తీరంలో ఉన్న భద్రాచలంలో పర్యటించారు. గోదావరి ముంపు ప్రాంతాలలో ప్రజలు సర్వంకోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.. వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు వచ్చానని చెప్పారు. భద్రాద్రి సీతారామయ్య దర్శనం అనంతరం భద్రాచలం కరకట్టను పరిశీలించారు. 2002లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కరకట్ట భద్రాద్రి వాసుల పాలిట శ్రీరామరక్షగా నిలిచిందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం చెప్పారు. ఈ క్రమంలోనే భద్రాచలానికి చెందిన టీడీపీ నేతలు ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ… 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు.