మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది. మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య విజ్ఞప్తి మేరకు కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఆర్. షా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ‘సొంత బాబాయి హత్యకేసు విచారణ పక్క రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా. తలెక్కడ పెట్టుకుంటావు జగన్ రెడ్డీ?’ అని ట్విట్టర్ లో వ్యంగాస్త్రాలు సంధించారు. సీఎం పదవికి జగన్ అనర్హుడని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు నారా లోకేష్ కూడా ‘బాబాయ్ హత్య కేసు పొరుగు రాష్ట్రానికి. అబ్బాయి చంచల్ గూడ జైలుకి’ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.