తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. బూరుగుపూడిలో ప్రయాణిస్తుండగా చంద్రబాబు కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు బంపర్ వంగిపోగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో 145 కిలోమీటర్ల పొడవునా చంద్రబాబు పర్యటిస్తున్నారు.
తొలిరోజు జగ్గంపేట, రెండో రోజు జగ్గం పేట, పెద్దాపురం, మూడో రోజు పెద్దాపురం, ఆనపర్తి నియోజకవర్గాలలో ఆయన పర్యటిస్తారు. చంద్రబాబు వెళ్లిన చోటల్లా స్థానికులు పూలు చల్లుతూ, మహిళలు దిష్టి తీస్తూ కనిపించారు. ప్రతి ప్రధాన సెంటర్లో క్రేన్ ద్వారా భారీ గజమాలలు వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అటు జగ్గంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ పరిపాలనను ఏకి పారేశారు.
45 రకాల పన్నులను ప్రజలపై బాదాడని, పది రూపాయలు ఇస్తూ 50 రూపాయలు దోచుకుంటున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. అడ్డుకోకుంటే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేస్తారని ఎద్దేవా చేశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించిన వెయ్యి ఎకరాలను వైసీపీ నేతలు కొట్టేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చిన రాజప్ప తదితరులు పాల్గొన్నారు.