మందుకు అడ్డురాలేదు, పంటల అమ్మకానికి అడ్డొచ్చాయ్.. బాబు ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

మందుకు అడ్డురాలేదు, పంటల అమ్మకానికి అడ్డొచ్చాయ్.. బాబు ఫైర్

May 6, 2020

Chandrababu Tweet On Farmers Problems

మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు రైతులు పంట అమ్మకానికి మాత్రం అడ్డువస్తున్నాయా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్‌లో అన్నదాతలు రోడ్డుపై కూరగాయలు పారబోసి నిరసన తెలుపుతున్న వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో పంటను అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోవడం ఏంటని మండిపడ్డారు.  రైతులు పంటను పారబోస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం ఆయన చేశారు. 

గొల్లపల్లి గ్రామానికి చెందిన కూరగాయల రైతులు బద్వేల్‌ మార్కెట్‌లో విక్రయించుకునేందుకు వచ్చారు. కానీ లాక్‌డౌన్ కారణంగా పోలీసులు అనుమతించలేదు. భౌతిక దూరం పాటించడం లేదంటూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వైన్ షాపుల వద్ద సామాజిక దూరం అవసరం లేదు కానీ తమకే ఈ నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నించారు. కొంతసేపు పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. తాము కష్టపడి పండించిన పంట వృథాగా పోవడం చూసి ఆవేదన చెందారు. ప్రభుత్వ పెద్దల తీరును వారు తప్పుబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.