విక్రమ్ ల్యాండర్‌కు చలానా వెయ్యం.. మరి స్పీడ్ సంగతేంటి?
Dear Vikram,
Please respond ??.
We are not going to challan you for breaking the signals!#VikramLanderFound#ISROSpotsVikram @isro#NagpurPolice— Nagpur City Police (@NagpurPolice) September 9, 2019
చంద్రయాన్2కు, చలాన్లకు ఏమైనా లింక్ వుందా? అస్సలు లేదు. ఎందుకంటే నింగిలో చంద్రుడిపై విక్రమ్ జాడలేకుండా పోయింది. చలాన్లకు, జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌కు ట్రాఫిక్ పోలీసులు లింక్ చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్‌కు, ట్రాఫిక్ చలాన్లకు జత చేసి నాగ్‌పూర్ సిటీ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన విక్రమ్.. దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్ బ్రేక్ చేసినందుకు మేము చలాన్ విధించం’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చాలామందిని ఆకర్షిస్తోంది. దీనిపై చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
‘నాకు తెలుసు నాగ్‌పూర్ పోలీసులు చంద్రునిపై కూడా ఉన్నారు’ అని ఓ నెటిజన్ సరదా కామెంట్ చేశారు. ‘ఒకవేళ విక్రమ్ స్పందిస్తే.. అది సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ఆ చలాన్ నాకు పంపించండి. ఆ జరిమానాను నేను కడతాను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ కేసు బెంగళూరు పోలీసుల పరిధిలోకి వస్తుంది’ ‘విక్రమ్ కోసం ఇది చాలా అమాయక సందేశం’ అంటూ ఇంకొందరు తమాషాగా అన్నారు.
ఇదిలావుండగా చంద్రయాన్2 ప్రయోగం విఫలం అవడంతో దేశప్రజలు తీవ్ర నిరాశలో వున్న విషయం తెలిసిందే. జాబిల్లికి చేరువగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ జాడ లేకుండా పోయింది. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ సురక్షితంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రకటించింది. దీంతో చంద్రయాన్-2 మిషన్‌పై అందరిలో ఆశలు చిగురించాయి. మళ్లీ ఏదో మాయ జరిగి విక్రమ్ స్పందిస్తే చంద్రయాన్2 లక్ష్యం నెరవేరుతుంది. విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో ప్రకటించడంతో.. ట్విటర్‌లో #ISROSpotsVikram హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది.