విక్రమ్ కనిపించడం లేదు.., రేపే ఆఖరి రోజు..  - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ కనిపించడం లేదు.., రేపే ఆఖరి రోజు.. 

September 19, 2019

Chandrayaan-2 Nasa lunar orbiter photographs Vikram lander.

జాబిల్లిపై పరిశోధనల కోసం  చంద్రయాన్ 2 లో భాగంగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. విక్రమ్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి ఇస్రో పనిచేస్తుంది. చంద్రుడిపై తప్పిపోయిన విక్రమ్ ల్యాండర్‌ ఫొటోలు తీసేందుకు నాసా ఇటీవల ప్రయత్నించింది.

విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని నాసా వ్యోమనౌక లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ సెప్టెంబరు 17న ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో  విక్రమ్‌ కన్పించిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని నాసా పేర్కొంది. ‘చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని మా ఆర్బిటర్‌ ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను పరిశీలిస్తున్నాం. ఈ ఫొటోలను పాత చిత్రాలతో పోల్చిన తర్వాతే ల్యాండర్‌ కన్పిస్తుందా లేదా అన్నది చెప్పగలం. ఒకవేళ ఫొటోలు తీసేప్పుడు ల్యాండర్‌ నీడలో ఉండొచ్చు లేదా నిర్దేశిత ప్రాంతానికి అవతల ఉండొచ్చు’ అని నాసా ఎల్‌ఆర్‌వో డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్‌ తెలిపారు. 

మరోపక్క.. విక్రమ్ పనికాలం రేపటితో ముగియనుంది. చంద్రునిపై పగలు రేపటితో ముగుస్తుంది. దక్షిణ ధ్రువంపై రెండు వారాలపాటు సూర్యక్రిరణాలు ప్రసరించవు. మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండడంతో విక్రమ్ గడ్డగట్టి పోతుంది.  ఫలితంగా సిగ్నల్స్ అసలు పనిచేయవు. .