Changed Indian Navy Flag
mictv telugu

వీడియో : ఛత్రపతి శివాజీ స్పూర్తి.. మారిన నావికా దళ పతాకం

September 2, 2022

భారత నౌకాదళ పతాకం మారింది. ప్రధాని మోదీ శుక్రవారం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జలప్రవేశం చేయించిన విషయం తెలిసిందే. దీని డిజైన్, నిర్మాణం పూర్తిగా మన దేశంలోనే జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేటి వరకు నావికా దళంలో బానిసత్వపు చిహ్నం ఉందని, దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజు స్పూర్తితో కొత్త పతాకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే చాలా మంది ఐఎన్ఎస్ విక్రాంత్‌ గురించే పట్టించుకున్నారు కానీ, పతాక మార్పు గురించి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో పతాక మార్పు గురించిన సమాచారం మైక్ టీవీ అందిస్తోంది.

మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకున్నా నేటికీ కొన్ని చోట్ల ఆ బానిసత్వ గుర్తులు అలాగే ఉండిపోయాయి. అందులో నేవీ జెండా ఒకటి. ఇప్పటివరకు ఉన్న పతాకంలో సెయింట్ జార్జి క్రాస్ ఉండేది. దానికంటే ముందు తెలుపు రంగుపై రెడ్ క్రాస్, యునైటెడ్ కింగ్‌డమ్ యూనియన్ జాక్ ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకంలో ఎడమవైపు జాతీయ పతాకం ఉండగా, కుడి వైపు అష్టభుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు కింద వేదాల నుంచి తీసుకున్న ‘సం నో వరుణ:’ అనే నినాదం ఉంచారు. దీనర్ధం ‘వరుణదేవా, మా పట్ల దయ చూపించి విజయాన్ని ప్రసాదించు’ అని దీని భావం. జాతీయ చిహ్నం చుట్టూ ఉన్న బంగారు రంగు బోర్డర్‌కు స్పూర్తి మహారాజు ఛత్రపతి శివాజీ రాజముద్ర. ఇది స్థిరత్వాన్ని వెల్లడిస్తుంది. నావికా దళం ఎనిమిది దిక్కులకు చేరగలదని, అనేక కార్యకలాపాలను నిర్వహించే శక్తి కలదని అష్టభుజి సూచిస్తుంది. కాగా, ఛత్రపతి శివాజీకి 60 యుద్ధ నౌకలు, 5 వేల మంది నావికా సైనికులు ఉండేవారు. విదేశీ దండయాత్రల నుంచి తీర ప్రాంతాన్ని కాపాడిన తొలి నావికా దళం శివాజీదే కావడం గమనార్హం.