ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీ బస్సులపై జనం కన్ను! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీ బస్సులపై జనం కన్ను!

December 3, 2019

s rtc bus01

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచిన సంగతి తెల్సిందే. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు ఏపీ ఆర్టీసీ బస్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి వందల్లో ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వస్తుంటాయి. తెలంగాణ ఆర్టీసీ చార్జీలతో పోలిస్తే ఏపీ ఆర్టీసీ చార్జీలు బస్సును బట్టి రూ. 20 నుంచి రూ. 50 వరకు తక్కువగా ఉండడంతో వాటినే ఎంచుకునే అవకాశం అధికంగా ఉంది. సరిహద్దు పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, జడ్చర్ల, సూర్యాపేట, కోదాడ, ఖమ్మంలకు వెళ్లే ప్రయాణికులు ఇక నుంచి తెలంగాణ బస్సులో కంటే ఏపీ బస్సులోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చార్జీల్లో ఉన్న వ్యత్యాసాన్ని రెండు ఉదాహరణల్లో పరిశీలిద్దాం. 

ఉదాహరణ1: 

హైదరాబాద్‌ నుంచి నల్గొండకు 100 కిలోమీటర్ల దూరం. ఈ రూట్‌లో గతంలో తెలంగాణ లగ్జరీ బస్సుల్లో రూ.110 చార్జీ వసూలు చేసేవారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచిన తర్వాత 130 వసూలు చేస్తున్నారు. ఏపీలోని గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, నర్సరావుపేట, పిడుగురాళ్లతో పాటు ఒంగోలు, నెల్లూరు డిపోల బస్సులు నల్లగొండ నుంచే వెళుతుంటాయి. ఏపీ బస్సుల్లో ఎక్కితే రూ.20ల వరకు చార్జీలు తగ్గే అవకాశం ఉంది. 

ఉదాహరణ2: 

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరిగిన ధరల ప్రకారం తెలంగాణ ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ బస్సుల చార్జీలు రూ.40 నుంచి రూ.50 తక్కువగా ఉంటాయి. ఇదే పరిస్థితి, కోదాడ, మిర్యాలగూడ, జడ్చర్లకు వెళ్లే వారికి ఎదురవుతుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా విజయవాడ, విశాఖపట్టణ, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం తదితర దూర ప్రాంతాలకు తెలంగాణ ఆర్‌టీసీ బస్సు సర్వీసులను నడుపుతోంది. ఇలాంటి సర్వీసుల్లో చార్జీలు ఏపీ బస్సుల కంటే తెలంగాణ బస్సుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.