నిత్యావసరాలు, ఇంధన ధరలు, ట్రాన్స్పోర్టు ఛార్జీలు ఎలాగూ పెరిగాయి.. వాటితో పాటు మనం కూడా పెంచేద్దాం అనుకున్నారేమో సమతాస్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రంలో సందర్శకులు ఎంట్రీ ఫీజులను పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.125 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం సెలవు కావడంతో ఆ రోజున సందర్శకులకు అనుమతి ఉండదని ప్రకటించారు. సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రధాన ఆకర్షణ అయిన డైనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శిస్తారు. లీలానీరాజనం పేరుతో నిర్వహిస్తున్న ఈ వాటర్ ఫౌంటెయిన్ షోను మధ్యాహ్నం ఒంటిగంటకు, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శిస్తారు.