కనకదుర్గ గుడిలో సింహాలు మాయం.. - MicTv.in - Telugu News
mictv telugu

కనకదుర్గ గుడిలో సింహాలు మాయం..

September 16, 2020

durgaa

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథం తగలబడిన విషయం తెల్సిందే. ఈ సంఘటనను మరువకముందే విజయవాడ కనకదుర్గ దేవాలయంలో మరో ఘటన చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయం ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాలు మాయమయ్యాయి. రథానికి ఉండే మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు తెలుస్తోంది. ఆలయ ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది. ఒక్కో సింహం విగ్రహాన్ని 8 కేజీల వెండి వినియోగించి తయారు చేసినట్టు సమాచారం. ఈ లెక్కన మొత్తం 24 కేజీల వెండి చోరీ అయింది. దాని విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. 

కానీ, ఆలయ ఈవో  సురేష్ బాబు మాత్రం సింహాలపై వెండి పూత మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అధికారుల వైఫల్యం వల్లే సింహాలు మాయమయ్యాయని బీజేపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఈవో‌ని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ విషయమై దేవాదాయ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నామని చెప్పారు. ‘రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కవర్‌ని తెరిచి చూశారు. ఆ సమయంలో మూడు సింహాలు కనిపించలేదు. వాటిని ఆలయ సిబ్బంది భద్రపరిస్తే సరే. ఒకవేళ దొంగతనం అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రథాన్ని ఒకసారి కూడా ఉపయోగించలేదు. ఈ చోరీ గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్దాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భద్రతా కట్టు దిట్టం చేశాం.’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.