అందాల పోటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధిని సత్తా చాటింది. కేరళలోని కొచ్చిలో జరిగిన సౌతిండియా అందాల పోటీలో విశాఖ అమ్మాయి చరిష్మా కృష్ణ టైటిల్ గెలుచుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాది మంది యువతులు పోటీపడ్డారు. వారందరినీ వెనక్కి నెట్టిన చరిష్మా.. కిరీటం ఎగరేసుకుపోయింది. రెండో రన్నరప్‌గా తమిళనాడుకు చెందిన దేబ్నితా కర్, రెండో రన్నరప్‌గా కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి నిలిచింది. ఇక చరిష్మ విషయానికొస్తే ఐదో తరగతి వరకు అమెరికాలో చదివి తర్వాత వైజాగ్ వచ్చి సెటిలయింది. చిన్ననాటి నుంచి ఫోక్, క్లాసిక్ డ్యాన్సులంటే ఇష్టపడే చరిష్మా ఇప్పటివరకు 30 కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. స్విమ్మింగ్, గుర్రపు స్వారీలలో శిక్షణ తీసుకుంది. అంతేకాక, ప్రముఖ నటనా గురువు ఎల్. సత్యానంద వద్ద నటనలో శిక్షణ తీసుకుంది. కొన్ని షార్ట్ ఫిలింలలో యాక్ట్ కూడా చేసింది.