నాకు చార్మినార్‌కు ఉన్నంత చరిత్ర ఉంది - MicTv.in - Telugu News
mictv telugu

నాకు చార్మినార్‌కు ఉన్నంత చరిత్ర ఉంది

September 1, 2019

టాలీవుడ్‌కు ఆయన కోటలాంటివాడనే చెప్పాలి. విలక్షణమైన పాత్రలు ఎన్నో పోషించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. కామెడియన్, విలన్ ఇలా ఏ పాత్ర అయినా పండించడంలో కోట దిట్ట. పద్మానాభం, నూతన్ ప్రసాద్, తనికెళ్ల భరణిలాంటి నటులు తనకన్నా ముందు తెలంగాణ యాసలో మాట్లాడారని తన మనసులోని భావాలను పంచుకున్నారు కోట. ‘తమ్మీ నాకైతే చార్మినార్‌కు వున్నంత చరిత్ర వుంది. కానీ, నాకు డేటాఫ్ బర్త్ లేదు. ఎప్పుడో కుప్పతొట్టిల ముష్టోన్కి దొరికినానంట. గప్పడిసంది ముష్టోల్లతోని ముష్టెత్తిన. కుష్టోల్లతోని దుప్పట్ల.. ఛీఛీఛీ అన్ల కుక్కలు గూడ పండవయ్య. మరి గట్ల బతికిన. మరి నా పహ్లి మర్డర్ ఎప్పుడు జేశిన అనుకుంటున్నవ్.. బచ్చాగాణ్ని పద్నాగేండ్లప్పుడు. అంటే నిక్కర్ మీద మర్డర్. చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం జేస్తం బతకాలె తమ్మీ. బ్లాక్‌ల టికెట్లు అమ్మిన. జేబులు కొట్టిన.. జైలుకు పోయిన.. మల్లొచ్చిన.. మల్ల పోయిన.. గట్లనే నడిశిన.. మల్ల గిప్పుడు జూడు’ అంటూ కోట తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ వీక్షకులను అలరిస్తోంది.

ఈ డైలాగ్ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గణేష్’ సినిమాలోనిది. ఇప్పటికైనా ఆ డైలాగ్‌ను కోట చకచకా చెప్పేస్తారు. ఇంతకాలమైనా ఆ డైలాగ్‌ను మరిచిపోలేదని ప్రశ్నించగా.. నా మనసుకు నచ్చింది నేనెప్పుడూ మరిచిపోనని చెప్పారు. తాను ఈ స్థితికి ఎదగడానికి కారణం అయిన తెలంగాణ మాండలికాన్ని తానెప్పుడూ మరిచిపోనని చెప్పారు.