క్యూబా విప్లవ యోధుడు చెగువేరా కూతురు, మనువరాలు హైదరాబాద్‌కు రానున్నారు. కొన్ని రోజుల కిందట చెగువేరా డాక్టర్ అలైద గువేరా, ఆమె కుమార్తె ప్రొఫెసర్ ఎస్టిఫోనియా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి వైద్య సేవల కోసం కేరళకు వెళ్లారు. అయితే వారు అక్కడి నుంచి బయలుదేరి పలు రాష్ట్రాలను సందర్శించనున్నారు. తరువాత ఈ నెల 22వ తేదీన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో చెగువేరా కూతురు, మనవరాలికి ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రొ.శాంతాసిన్హా, ప్రొ.హరగోపాల్, ప్రొ.కె.నాగేశ్వర్ సహా భారాస, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఉపన్యాసకులుగా హాజరవుతారు. వారికి ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ, మజ్లిసేతర పార్టీల ప్రతినిధులతో కూడిన సంఘీభావ కమిటీ నిర్ణయించింది. వీరంతా వేధికపై ప్రసంగించే అవకాశం ఉంది.
గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి, సంఘీభావ కమిటీ సమన్వయకర్తలు డీజీ నర్సింహారావు, బాలమల్లేశ్, శ్రీపతి సతీష్ (తెదేపా), గోవర్ధన్ (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), దిడ్డి సుధాకర్(ఆప్), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక కరపత్రాన్ని ఆవిష్కరించారు.