టాలీవుడ్ వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో మాతృశ్రీనగర్కు చెందిన శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్ నిర్వాహకుడు శేఖర్ రాజు ఫిర్యాదు చేశారు. శేఖర్ రాజు మాట్లాడుతూ..” గతంలో ఆర్జీవీ దిశ సినిమాను నిర్మించటానికి నా దగ్గర 56 లక్షలు తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇస్తానని చెప్పాడు. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వటం లేదు. డబ్బులు ఇవ్వమని అడిగిన ప్రతిసారి నాపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అందుకే ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై చీటింగ్ కేసు పెట్టాను” అని ఆయన అన్నారు.
అనంతరం ఆర్జీవీపై చర్యలు తీసుకొని, తన వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేలా న్యాయం చేయాలని శేఖర్ రాజు సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో వాదోపవాదనలు విన్న న్యాయస్థానం.. 406, 417, 420, 506 సెక్షన్ల కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.