ఎయిడ్స్‌ వ్యాధికి చెక్.. ఇంజక్షన్‌ రెడీ - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిడ్స్‌ వ్యాధికి చెక్.. ఇంజక్షన్‌ రెడీ

June 16, 2022

ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటివరకు సరైన ట్రీట్‌మెంట్ గాని, మందులు గాని, ఇంజక్షన్ గాని లేవు. చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం అంటూ వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తూ, ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయోలు దేశ శాస్త్రవేత్తలు, వైద్యులు ఓ శుభవార్తను చెప్పారు. వైద్య చరిత్రలో ఇదొక మైలురాయిగా చెప్పవచ్చు. ఎయిడ్స్‌ వ్యాధికి ఇంజక్షన్‌ రెడీ చేశామని, త్వరలోనే ఇంజక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ‘

‘ఈ వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్‌ అత్యంత సమర్థంగా ఉన్నట్లు మా అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో తొలి దశలో మేం విజయం సాధించాం. ఈ ఇంజెక్షన్‌తో వైరస్‌ నిర్వీర్యం కావడంతోపాటు, రోగుల ఆరోగ్యం బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్‌–టైప్‌ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్‌ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్‌ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి. ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్‌ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేశాయి. యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు” అని శాస్త్రవేత్త డాక్టర్‌ బర్జేల్‌ అన్నారు.

ఇక, ఈ ఇంజక్షన్‌ను టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో ఏండ్లుగా, ఎన్నో పరిశోధనలు చేసి, జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. ఈ ఇంజక్షన్ పరిశోధన వివరాలను ఇటీవలే నేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెట్టనున్నట్లు శాస్త్రవేత్తలు ధీమాను వ్యక్తం చేసినట్లు నేచర్‌ జర్నల్‌ వివరించింది. ఏదిఏమైనప్పటికి ఎయిడ్స్ వ్యాధి వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ సరైన ఇంజక్షన్ లేదు. ఈ క్రమంలో ఇజ్రాయోలు దేశ శాస్త్రవేత్తలు, వైద్యులు ఎయిడ్స్‌ను చిత్తుచేసే ఓషధాన్ని కనిపెట్టినట్లు తెలుపడం శుభపరిణామం అని నిపుణులు పేర్కొంటున్నారు.