ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. ఈ-50లు వచ్చేస్తున్నాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. ఈ-50లు వచ్చేస్తున్నాయ్

May 30, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ‘ఈ-ప్లేన్’ అనే సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా రాబోయే రోజులలో రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ‘ఎయిర్ ట్యాక్సీల’ను రెడీ చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.

సంస్థ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..”ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేలా, హెలికాప్టర్ మాదిరిగా దీన్ని తీర్చిదిద్దాం. వచ్చే ఏడాది ట్రయల్ రన్ నిర్వహిస్తాం. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవలే జరిగిన డ్రోన్ ఫెస్టివల్‌లో ఈ ఎయిర్ ట్యాక్సీ మోడల్‌ను ప్రదర్శించాం. అందరూ దీన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ-20 పేరుతో ఎయిర్ ట్యాక్సీ నమూనా రూపొందించాం. హెలికాప్టర్‌లాగే ఇది కూడా గాలిలో ఎగురుతుంది. దీంట్లో రెండు సీట్లు ఉంటాయి. ఒకటి పైలట్‌కు, మరొకటి ప్రయాణికుడికి. 12 ప్లాస్టిక్ పేపర్ రోటర్లను అమర్చాం. ఇది 200 కిలోమీటర్ల వరకు గంటకు గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 3,000 మీటర్ల ఎత్తువరకు వెళుతుంది” అని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ట్యాక్సీ అభివృద్ధి దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఇంటి పైకప్పు నుంచే రాకపోకలను సాగించేలా దీన్ని తయారు చేస్తున్నామని అన్నారు. ఈ ట్యాక్సీ పొడవు 5 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు, మోడల్ 3 మీటర్ల పొడవు, వెడల్పుతో మరొకటి తయారు చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పైలట్ అవసరం లేని ఈ ట్యాక్సీకి ఈ-50 అని పేరు పెట్టినట్లు, ఇంజిన్ పనులు తుది దశలో ఉన్నట్లు సంస్థ అధికారులు వివరించారు.