విశాఖలో విష వాయువుల కలకలం..రోడ్డుపైనే పడిపోతున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో విష వాయువుల కలకలం..రోడ్డుపైనే పడిపోతున్న జనం

May 7, 2020

Chemical Gas Leaked in Visakhapatnam

విశాఖపట్టణంలో విషయవాయువుల లీకేజీ కలకలం సృష్టించింది.  గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా అస్వస్థతకు గురౌతున్నారు. చాలా మంది జనం రోడ్డుపైనే పడిపోయి కనిపిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ భారీ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఊహించని విధంగా జరిగిన గ్యాస్ లీకేజీతో నిద్రలో ఉన్న వారంతా కంగారు పడ్డారు. ప్రాణాలను కాపాడుకునేందుకు స్థానికులు అంతా పరుగులు తీశారు. గ్యాస్ కారణంగా కళ్లు కనిపించక ఇద్దరు బావిలో పడి మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రజలంతా నిద్రిస్తున్న సమయంలో పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకైంది. ఇది దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించింది. వెంటనే ఈ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  తల్తెత్తింది. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విషయవాయులు పెద్ద ఎత్తున విస్తరించడంతో పోలీసులు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన చాలా మంది రోడ్డుపై పడిపోతూ కనిపించారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అంబులెన్సులను తీసుకువచ్చి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ  చేయిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 

గ్రామాలకు సమీపంలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు డబ్బులకు ఆశపడి తమ ప్రాణాలను గాలిలో దీపంలా తయారు చేశారని మండిపడుతున్నారు. వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిపుణులైన కార్మికులతో కాకుండా వేరే వారితో పరిశ్రమలో పని చేయించడం వల్లే ఈ విధమైన ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా స్పందించారు. వెంటనే ప్రజలకు కావాల్సిన వైద్యం అందించాలని, మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లైకైన గ్యాస్ స్పృహతప్పి పడిపోయేలా చేస్తుందని, అందుకే ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ఎక్కువ మంది అస్వస్థతతకు గురయ్యారని పేర్కొన్నారు. అయితే పాలిమర్ కంపెనీ నివాసాల మధ్య ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.