నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు పండే చోట… సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలి. దానికి మన మెరిసిపోయే దుస్తులు తోడైతే ఆ కళే వేరు. ఈసారి పండుగకు కొత్తగా చేనేత బట్టలను ట్రై చేస్తే…వాటితోనే మెరిసిపోయే అందాలు మన సొంతం చేసుకుంటే….భలే మంచి ఐడియా కదా. సింపుల్ గా, అందంగా చేనేతతో ఎలా సింగారించుకోవచ్చునో తెలుసుకుందాం రండి.
సంక్రాంతి అంటే తెలుగు పండగ. తెలుగు వారి లోగిళ్ళు ధనధాన్యాలతో నిండే పండుగ. మరి ఇలాంటి పండుగలో తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి మేమూ సిద్ధం అంటున్నాయి మన చేనేతలు.
సాధారణంగా లంగావోణీ, లెహంగా డిజైన్స్ భారీ ఫ్లెయిర్, నెటెడ్ మెటీరియల్స్ తో ఉంటాయి. లేదా పట్టును ఎంచుకుంటారు. కానీ చేనేత వస్త్రాలతో కూడా అదిరిపోయే లుక్ ను మన సొంతం చేసుకోవచ్చు అంటున్నారు డిజైనర్లు. చేనేత దుస్తులు సంప్రదాయంగా, అందంగా ఉండడమే కాదు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటాయని చెబుతున్నారు.
కంచిపట్టు :
సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడతారు. కానీ అలా కాకుండా బ్లౌజ్, దుప్పట్టా ఒక కలర్ ఉండి, లంగా వేరే కలర్ లో ఉంటే లుక్ మారుతుంది. ట్రెండీగా ఉండి అందంగా కనిపిస్తుంది.
ఇకత్
ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగా లేదా లంగాకు తీసుకున్నప్పుడు బార్డర్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తారు. ఆ లోటు పూడ్చడానికి అంచుభాగాన్ని ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చును . అలాగే, బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీని వేసుకోవచ్చును. ఇది ఏ సంప్రదాయ వేడకకైనా అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ అవుతుంది.
తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దాని మీదకు కలంకారీ దుపట్టాఅద్దిరిపోయే కాంబినేషన్. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు.
వివాహ వేడుకల్లో లేదా పండుగల్లో అమ్మాయిల అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. పెద్ద అంచు ఉన్న గద్వాల్ పట్టుతో డిజైన్ చేసిన లంగా ఓణీ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉండా బావుంటుంది.