ఏ సమయంలో అయినా డబ్బులు కావాలంటే ఏటీఎంలకు వెళతాం. ఈ మధ్యనే బెంగళూరులో బంగారాన్ని ఎప్పుడంటే అప్పుడు పొందేందుకు ఏటీఎంలను ఏర్పాటు చేశారు. కానీ చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ మాత్రం వినూత్నమైన ఐడియాతో ముందుకు వచ్చింది. బిర్యానీ లవర్స్‌ను ఖుషి చేసేందుకు మనుషులే లేని ఏటీఎం బిర్యానీ సెంటర్లను ఏర్పాటు చేసింది. చెన్నై ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఏంటి మనుషులే లేని ఏటీఎం బిర్యానీ సెంటర్లా..? బిర్యానీని కూడా ఏటీఎం సెంటర్ల ద్వారా కొనచ్చా..? ఫుడ్ ఫ్రెష్‌గా ఉంటుందా..? అంటే అవునని ఓ కంపెనీ నిరూపిస్తోంది.
సాధారణంగా బిర్యానీ కావాలంటే హోటల్స్‌కు వెళతాం. అక్కడ గంటలు గంటలు క్యూ లైన్లో వెయిట్ చేసే ఓపిక లేనివారు ఈ మధ్య ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఆనల్లైన్లోనూ కస్టమర్ల తాకిడి పెరగడంతో డెలివరీకి కూడా చాలా సమయం పట్టేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ బై వీటు కళ్యాణం బిర్యానీ రిస్క్ లేకుండా కస్టమర్లకు బిర్యానీ అందించాలని సరికొత్తగా ఆలోచనతో ముందుకు వచ్చింది. సరిగ్గా 2020లో కరోనా లాక్‌డౌన్‌కు 45 రోజుల ముందు ఈ బిర్యానీ సెంటర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి మనుషులు లేకుండా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో బిర్యానీని అందిస్తోంది. ఈ ఐడియా వర్కౌట్ కావడంతో విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తోంది.
ఈ బిర్యానీ సెంటర్లలో ఒక్క మనిషి కూడా ఉండడు. ఏటీఎం మెషిన్ మాదిరిగి ఓ మెషిన్ ఉంటుంది. ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పైన బిర్యానీల మెనూ ఉంటుంది. కస్టమర్లు వారికి ఏం కావాలో ఆ బొమ్మను సెలక్ట్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే చాలు బిర్యానీ మీ ముందుంటుంది. బిర్యానీ ఎంత సేపట్లో వస్తుందో టైమ్ కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. టైం ముగిసే లోపు కియోస్క్‌లో అందంగా ప్యాకింగ్ చేసిన బిర్యానీ కిట్ ప్రత్యక్షమవుతుంది. మెనూలో చికెన్, మటన్, ఎగ్ బిర్యానీలతో పాట్లు చికెన్ 65, ఫ్రైడ్ చికెన్ వంటి స్టార్టర్స్, డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మినీ, రెగ్యులర్, బకెట్ వంటి ఆప్షన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. బిర్యానీ రేట్లు కూడా రూ.220 నుంచి రూ.449 వరకు ఉన్నాయి. కస్టమర్లు తమకు కావాల్సిన ఐటెంను కావాల్సిన క్వాంటిటీలో కేవలం ఐదు నిమిషాల సమయంలో ఈ ఏటీఎం బిర్యానీ సెంటర్ ద్వారా పొందుతున్నారు. ఇలా ఏటీఎంల ద్వారా బిర్యానీని ఆర్డర్ చేస్తూ తీసుకెళ్లడం కొత్త అనుభవాన్ని అందిస్తోందని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రుచి, నాణ్యతను పాటించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని స్టార్టప్ సీఈఓ ఫహీం తెలిపారు. ఇదే ఐడియాను తెలంగాణ, ఏపీలోనూ ప్రవేశపెట్టాలని బిర్యానీ లవల్స్ కోరుకుంటున్నారు.